భారత అంతరిక్ష చరిత్రలో అ‘ద్వితీయ’ సువర్ణాధ్యాయం లిఖితమైంది. నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత విను వీధుల్లో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది. 146 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలను నిజం చేస్తూ మన వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసీలోకి విజయవంతంగా ప్రయాణం మొదలు పెట్టారు. శుభాన్షుతో సహా మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకొని స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టనున్న తొలి భారతీయుడిగా, రాకేశ్ శర్మ తర్వాత రోదసీలోకి వెళ్లిన రెండో ఇండియన్‌గా శుభాన్షు నూతన రికార్డు సృష్టించారు.
నా ప్రియమైన దేశ ప్రజలకు నమస్కారం. 41 ఏండ్ల తర్వాత మనం అంతరిక్షానికి చేరుకొన్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ఇప్పుడు మేం భూ కక్ష్యలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. నా భుజాలపై మన మూడు రంగుల జెండా ఉన్నది. అది చూస్తుంటే నాతో మీరంతా ఉన్నారనే భావన కలుగుతున్నది. ఇది కేవలం నా ఒక్కడి అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు.. భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది కూడా. నా ఈ ప్రయాణంలో మీరంతా భాగస్వాములవ్వాలని కోరుకొంటున్నా. జై హింద్.. జై భారత్..
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా రోదసి ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రయోగించిన స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. లాంచింగ్ అనంతరం కొద్ది నిమిషాల తర్వాత రాకెట్ నుంచి డ్రాగన్ వ్యోమనౌక ‘గ్రీస్’ విజయవంతంగా విడిపోయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. పది నిమిషాల అనంతరం ఆ క్యాప్సుల్ 200 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్ష్యలోకి చేరినట్టు వెల్లడించారు. 28 గంటల ప్రయాణం తర్వాత.. గురువారం సాయంత్రం 4.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం..) వ్యోమనౌక ఐఎస్ఎస్తో అనుసంధానం కానున్నట్టు వివరించారు. శుభాన్షు రోదసి యాత్రపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
వ్యోమనౌక భూకక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం శుభాన్షు కమాల్ కీ రైడ్ తీ ( ఇదో గొప్ప ప్రయాణం) అంటూ భారత పౌరులను పలకరించారు. ‘నా ప్రియమైన దేశ ప్రజలకు నమస్కారం. 41 ఏండ్ల తర్వాత మనం అంతరిక్షానికి చేరుకొన్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ఇప్పుడు మేం భూ కక్ష్యలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. నా భుజాలపై మన మూడు రంగుల జెండా ఉంది. అది చూస్తుంటే నాతో మీరంతా ఉన్నారనే భావన కలుగుతున్నది. ఇది కేవలం నా ఒక్కడి అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు.. భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది కూడా. నా ఈ ప్రయాణంలో మీరంతా భాగస్వాములవ్వాలని కోరుకొంటున్నా. జై హింద్.. జై భారత్’ అంటూ హిందీలో తానిచ్చిన సందేశంలో శుభాన్షు పేర్కొన్నారు. ప్రయోగానికి ముందు కుటుంబసభ్యులతో వీడియోకాల్‌లో మాట్లాడిన శుభాన్షు.. ‘నా కోసం వేచి ఉండండి. నేను వస్తున్నా’ అంటూ పేర్కొన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వ్యోమగాములను పంపించి అక్కడ పలు ప్రయోగాలు చేయించడానికి అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’.. నాసా, స్పేస్ఎక్స్, ఇస్రో, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ భాగస్వామ్యంతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దీర్ఘకాలంపాటు చేపట్టే రోదసి యాత్రల్లో వ్యోమగాముల శారీరక మార్పులపై ప్రధానంగా ఈ మిషన్‌లో రిసెర్చ్ చేయనున్నారు. రోదసి యాత్రల సమయంలో కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై కలిగే ప్రభావం.. ఇలా 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలను చేయనున్నారు.
ఐఎస్ఎస్కు చేరుకొనే డ్రాగన్ క్యాప్సుల్ ‘గ్రీస్’లో శుభాన్షుతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, హంగరీకి చెందిన టిబర్ కపు, పోలండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ ఉంటారు. పెగ్గీ మిషన్ కమాండర్‌గా వ్యవహరిస్తుండగా, శుభాన్షు మిషన్ పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో భారతీయ వ్యోమగామి ప్రశాంత్ నాయర్ బ్యాకప్ క్రూలో భాగంగా ఉన్నారు.
1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టిస్తున్నారు. ఐఎస్ఎస్లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే.
భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్లో ఈ నలుగురు వ్యోమగాములు 14 రోజుల పాటు ఉండనున్నారు. ఐఎస్ఎస్ను చేరుకోవడానికి సుమారు 28 గంటల పాటు ప్రయాణించనున్నారు.
శుభాన్షు శుక్లా రోదసిలోకి వెళ్లేకంటే ముందు ఓ పాటను విన్నారు. నిరుడు విడుదలైన బాలీవుడ్ సినిమా ‘ఫైటర్’లోని ‘వందేమాతరం’ పాట అంటే ఆయనకు ఎంతో ఇష్టమట. మిషన్ ప్రారంభానికి ముందు అదే పాటను ఆయన వింటూ ఉల్లాసంగా ప్రయాణమయ్యారని సంబంధితవర్గాలు తెలిపాయి.
గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్షయానంతో దేశమంతా ఉద్విగ్నభరితమైంది. ఆయన యాత్ర పట్ల దేశం గర్విస్తున్నది. ఆయనతో పాటు వివిధ దేశాలకు చెందిన ఆయన సహచర వ్యోమగాములు ప్రపంచమంతా ఒక్కటే అనే వసుధైక కుటుంబ భావన నిజమని నిరూపించారు. ఇస్రో-నాసా భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే వారి మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. వారు చేసే శాస్త్రీయ అధ్యయనాలు, అంతరిక్ష పరిశోధనలు ఆయా రంగాల్లో కొత్త హద్దులను నిర్ణయిస్తాయి.
శుభాన్షు శుక్లా తనతో పాటు 140 కోట్ల మంది భారతీయుల ఆశలను, ఆకాంక్షలను మోసుకెళ్తున్నారు. ఐఎస్ఎస్కు వెళ్తున్న తొలి భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. శుక్లాతోపాటు ఇతర వ్యోమగాములందరికీ విజయం లభించాలని కోరుకుంటున్నా.
శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రపై రోదసిలోకి వెళ్లొచ్చిన తొలి భారత వ్యోమగామి రాకేశ్ శర్మ స్పందించారు. వ్యోమనౌక కిటికీలోంచి ఎంతో సుందరంగా కనిపించే పుడమి అందాలను చూస్తూ మురిసిపోవాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.