Supreme Court : దేశంలో భూకంపాల (Earthquakes) వల్ల జరిగే నష్టాలను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. దేశంలోని 75 శాతం జనాభా అధిక భూకంప ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉన్నారని, భూకంపాల వల్ల జరిగే నష్ట తీవ్రతను తగ్గించేలా సూచనలు చేయాలని కోరుతూ ఓ వ్యక్తి పిటిషన్ వేశారు.
ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఢిల్లీ మాత్రమే భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతంగా ఉండేదని, ఇప్పుడు దేశంలో 75 శాతం మంది తీవ్ర భూకంప ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటున్నారని పిటిషనర్ చెప్పడంతో.. ‘అయితే అందరినీ చంద్రుడిపైకి పంపించాలా.. లేదంటే మరెక్కడికైనానా..?’ అని ధర్మాసనం ప్రశ్నించింది.
దాంతో పిటిషనర్.. ఇటీవల జపాన్‌లో తీవ్ర భూకంపం సంభవించిన విషయాన్ని గుర్తుచేశారు. దాంతో.. ముందుగా మనం దేశంలోకి అగ్నిపర్వతాలను తీసుకొచ్చి, ఆ తర్వాత జపాన్‌తో పోల్చాలని కోర్టు వ్యాఖ్యానించింది. భూకంపాల సందర్భంగా నష్ట తీవ్రతను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని పిటిషనర్ కోరగా.. ఆ పని చేయాల్సింది ప్రభుత్వమని, కోర్టు కాదని ధర్మాసనం స్పష్టంచేసింది.
చివరగా పిటిషనర్ భూకంపాలకు సంబంధించి మీడియాలో వచ్చిన నివేదికలను కోర్టు దృష్టికి తీసుకురాగా.. వాటిని పరిశీలించిన ధర్మాసనం ఇవి వార్తా పత్రికల నివేదికలని, వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.