Karnataka | మైసూర్/మండ్య, ఏప్రిల్ 1: కర్ణాటకలో త్వరలో సీఎం మార్పు జరుగనున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత లేదా అసెంబ్లీ టర్మ్ మధ్యలోనే నాయకత్వ మార్పు ఉంటుందని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతున్న వేళ.. తాజాగా సోమవారం వేర్వేరుగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న వీరిద్దరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా తానే సీఎంగా కొనసాగాలంటే.. తన వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వాలని సిద్ధరామయ్య ప్రజలను కోరారు. ‘నేను సీఎంగా కొనసాగాలా? వద్దా?.. వరుణలో కాంగ్రెస్ అభ్యర్థికి 60 వేల మెజార్టీ ఇవ్వండి’ అంటూ సిద్ధరామయ్య ప్రజలను చేతులేత్తి అభ్యర్థించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో తన సీఎం పదవి భవిష్యత్తును ముడిపెడుతూ మాట్లాడారు. మరోవైపు మండ్యలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న డీకే శివకుమార్, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్కు ఓటేసిన ప్రజల కోరిక.. ‘అబద్ధం కాబోదు’ అంటూ వ్యాఖ్యానించారు.
చేతులెత్తి అభ్యర్థిస్తున్నా..
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుణలో నిర్వహించిన సభలో సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి భారీగా మెజార్టీ ఇవ్వాలని ఓటర్లను కోరారు. ‘2019 లోక్సభ ఎన్నికల్లో ధ్రువనారాయణ్(కాంగ్రెస్ అభ్యర్థి) కేవలం 1,817 ఓట్లతో ఓడిపోయారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో వరుణలో మీరు నాకు 48 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థికి మన నియోజకవర్గంలో 60 వేల ఓట్ల ఆధిక్యం ఇస్తే, నేను సంతోషిస్తాను. అప్పుడు నన్ను ఎవరూ టచ్ చేయలేరు. నేను సీఎంగా ఉండాలా? వద్దా? చేతులెత్తి అభ్యర్థిస్తున్నా. గెలిచిన తర్వాత మీకు ధన్యవాదాలు చెప్పేందుకు మళ్లీ వస్తా’ అని పేర్కొన్నారు. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం చామరాజనగర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి మహదేవప్ప కుమారుడు సునీల్ బోస్ పోటీచేస్తున్నారు.
ఆందోళన చెందొద్దు..
మరోవైపు తన కమ్యూనిటీ వొక్కలిగల ప్రభావం అధికంగా ఉండే మండ్య జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను దృష్టిలో పెట్టుకొని ఓటేసిన మీ కోరిక అబద్ధం కాబోదంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ‘నేను మీకు ఒక్కటి చెప్పదలచుకొన్నా.. నన్ను దృష్టిలో ఉంచుకొని, గత అసెంబ్లీ ఎన్నికల్లో మండ్య జిల్లాల్లో కాంగ్రెస్కు అధిక సీట్లు ఇచ్చారు. మీ కోరిక అబద్ధం కాబోదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని శివకుమార్ పేర్కొన్నారు. కాగా, గత ఏడాది అసెంబ్లీలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి పదవి కోసం డీకే తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే డీకేకు నచ్చజెప్పిన పార్టీ అధిష్ఠానం.. సిద్ధరామయ్యకు సీఎం పోస్టు ఇచ్చింది. ‘రెండున్నర ఏండ్ల తర్వాత సీఎం మార్పు’ అనే ఫార్ములా ఆధారంగానే హైకమాండ్ ఇద్దరి మధ్య రాజీ కుదుర్చిందనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి.
‘నేను సీఎంగా కొనసాగాలా? వద్దా? లోక్సభ ఎన్నికల్లో వరుణలో కాంగ్రెస్ అభ్యర్థికి 60 వేల మెజార్టీ ఇవ్వండి. అప్పుడు నన్ను ఎవరూ టచ్ చేయలేరు. చేతులేత్తి అభ్యర్థిస్తున్నా..’
– వరుణలో సీఎం సిద్ధరామయ్య
‘మీకు ఒక్కటే చెబుతున్నా.. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నన్ను దృష్టిలో ఉంచుకొని గెలిపించారు. మీ కోరిక అబద్ధం కాబోదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’
– మండ్యలో డీకే శివకుమార్