మహబూబ్నగర్, సెప్టెంబర్ 18: అమెరికాలో జరిగిన కాల్పుల్లో మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ పట్టణంలోని రామయ్యబౌళిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ టీచర్ మహమ్మద్ హస్నొద్దీన్, అతడి భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు. పెద్ద కుమారుడు అమీర్ అలియాస్ నిజాముద్దీన్ (34) ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికాకు వెళ్లాడు.
చదువు పూర్తి చేసుకున్నాక కాలిఫోర్నియాలోని గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నలుగురు స్నేహితులతో కలసి ఉంటున్నాడు. అయితే గత 15 రోజుల కిందట జరిగిన కాల్పుల్లో నిజాముద్దీన్ మృతి చెందాడు. ఈ విషయాన్ని అతడి తోటి స్నేహితులు గురువారం ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. రెండు వారాల తర్వాత ఆలస్యంగా కుటుంబ సభ్యులకు సమాచారం తెలిసింది. దీంతో ఫ్యామిలీ దుఃఖసాగరంలో మునిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎలాగైనా తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.