Arvind Kejriwal | ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈడీ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీని వివరణ కోరింది. పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొమ్మిది సార్లు ఢిల్లీ సీఎంకు సమన్లు జారీ చేసింది. తాజాగా గురువారం (మార్చి 21)న విచారణకు రావాలని నోటీసుల్లో కోరగా.. విచారణకు గైర్హాజరయ్యారు.
సీఎం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఏవీ రాజు వాదనలు వినిపిస్తూ అరెస్టు చేస్తామని చెప్పలేదన్నారు. మొదట విచారణకు రావాలని.. అరెస్టు చేయవచ్చు.. చేయకపోవచ్చన్నారు. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేస్తుందనే భయం ఉందని.. రక్షణ కల్పిస్తే విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని పేర్కొంది. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీ స్పందన కోరుతూ ఏప్రిల్ 22 వరకు గడువు ఇచ్చింది.