Shobha Karandlaje : అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో విపక్ష నేతని, దేశం బయట ఆయన భారత ప్రతిపక్ష నేత కాదని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె అన్నారు. దేశం వెలుపల మనమంతా ఒక్కటేనని, ఆయన ఇలా ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. మంత్రి బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాహుల్ తీరును తప్పుపట్టారు. భారత్ ప్రతిష్టను మసకబార్చడం ద్వారా ఆయన ఉద్దేశం ఏంటని నిలదీశారు.
దేశానికి వ్యతిరేకంగా ఏమైనా కుట్ర జరుగుతున్నదా తాము ఇలాంటి కుయుక్తులను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇక అమెరికా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యలను అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ విదేశీ పర్యటనలో అర్ధరహిత, నిరాధార, తప్పుదారి పట్టించే అవాస్తవాలను పదేపదే వల్లెవేస్తున్నారని రక్షణ మంత్రి తప్పుపట్టారు. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవి దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. భారత్లో సిక్కులను గురుద్వారల్లో తలపాగాలను ధరించనీయడం లేదని, తమ మతాచారాలను పాటించకుండా నిరోధిస్తున్నారని రాహుల్ చెప్పారని ఇది పూర్తిగా సత్యదూరమని రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
ఎన్డీయే ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించాలని కోరుకుంటున్నదని ప్రచారం చేశారని ఇది నిరాధార ఆరోపణని మంత్రి పేర్కొన్నారు.అమెరికా పర్యటనలో చైనా సరిహద్దు విషయంలోనూ తప్పుదారిపట్టించే అవాస్తవాలను మాట్లాడారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రేమ దుకాణానికి బదులు అసత్యాల దుకాణం తెరిచారని ఎద్దేవా చేశారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం ఆయన మానుకోవాలని హితవు పలికారు. విపక్ష నేతగా రాహుల్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
Read More :