Shobha Karandlaje : కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి సిద్ధరామయ్య మైసూర్ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA)లో అక్రమంగా 12 స్ధలాలు స్వాహా చేశారని ఆరోపించారు. 1992లో ముడా కేసరె గ్రామంలో భూ సేకరణ చేపట్టి రూ. 3.81 లక్షల పరిహారం అందించిందని చెప్పారు.
అయితే పార్వతి సిద్ధరామయ్య పరిహారం అంగీకరించలేదని, అప్పట్లో సిద్ధరామయ్య ఆర్ధిక మంత్రిగా ఉన్నారని ఆమె గుర్తుచేశారు. 1998లో ఆయన డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సమయంలోనూ ఈ వ్యవహారంపై మౌనం దాల్చారని చెప్పారు. 2017లో పరిహారం కోసం సిద్ధరామయ్య ముడాపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. 2022లో నిబంధనలకు విరుద్ధంగా పార్వతి సిద్ధరామయ్యకు కేసరె గ్రామంలో సేకరించిన భూమి నుంచి 14 సైట్లను ముడా కట్టబెట్టిందని చెప్పారు.
ఇది చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని మంత్రి ఆరోపించారు. సిద్ధరామయ్య తాను కూడా లబ్ధిదారుడుగా ఉన్నారని చెప్పారు. సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రాకుండా కాంగ్రెస్ పెద్దలు కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. సిద్ధరామయ్య ఎప్పుడూ తన కార్యాలయాన్ని లాభదాయక పనులకు వాడుకుంటారని, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నదని ఆమె దుయ్యబట్టారు.
Read More :
Pakistan | అచ్చుగుద్దినట్టు అనుకరిస్తున్నాడు.. పాక్లో యంగ్ బుమ్రా.. వీడియో