Shivraj Singh Chouhan : కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుల ప్రాణాలను బలిగొన్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్యసభలో పేర్కొన్నారు. సోమవారం ఆయన పెద్దల సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా పెద్దసంఖ్యలో రైతులను పొట్టనపెట్టుకున్నదని దుయ్యబట్టారు.
1986లో బిహార్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిపిన కాల్పుల్లో 23 మంది రైతులు మరణించారని గుర్తుచేశారు. 1988లో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఇద్దరు రైతులను చంపేశారని ఆరోపించారు. 1988లో మీరట్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతులు మరణించారని శివరాజ్ చౌహాన్ పేర్కొన్నారు. తాము కిసాన్ సమ్మాన్ నిధి గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ రైతులకు నేరుగా సాయం అందించడంపై మాట్లాడుతోందని అన్నారు.
కాంగ్రెస్ ఎన్నడూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పధకాన్ని తీసుకురాలేదని చెప్పారు. ప్రధాని మోదీ రైతుల సంక్షేమం కోసం ఈ పధకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. రూ. 6000 చిన్న, సన్నకారు రైతులకు గొప్ప ఊరట అన్న విషయం వీరికి (విపక్షాలు) అర్ధం కావడం లేదని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధితో రైతులు స్వయం సమృద్ధి సాధిస్తారని, రైతు సాధికారత సాధ్యమై వారికి సమాజంలో గౌరవం పెరిగిందని అన్నారు. రైతన్నలకు గౌరవం పెరగడాన్ని విపక్షం జీర్ణం చేసుకోలేకపోతోందని చౌహాన్ విమర్శించారు.
Read More :
Rakul Preet Singh | హైదరాబాద్‌లో ‘ఆరంభం’.. మరో బ్రాంచ్‌ను ఓపెన్ చేసిన రకుల్