లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికార నివాసం కింద శివలింగం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా తవ్వకాలు జరుపాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని రోజుల కిందట సంభాల్‌లో మొఘల్ కాలం నాటి మసీదు సర్వే నేపథ్యంలో అల్లర్లు జరిగాయి. ఈ ఘర్షణలో పలువురు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత సంభాల్‌లో పలు చోట్ల తవ్వకాలతోపాటు ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
కాగా, అఖిలేష్ యాదవ్ సోమవారం దీని గురించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలు కప్పిపుచ్చడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతోందని ఆయన విమర్శించారు. అమాయకుల ఇళ్లను బుల్డోజర్లతో అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ‘సీఎం అధికార నివాసం కింద కూడా శివుడి రూపాన్ని సూచించే స్థూపాకార శివలింగం ఉందని మేం భావిస్తున్నాం. అక్కడ కూడా తవ్వకాలు జరుపాలి’ అని అన్నారు.
మరోవైపు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శివలింగం గురించి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు.