Asha Kiran Shelter Home : ఢిల్లీలోని ఆశా కిరణ్ షెల్టర్ హోంలో మరణాలపై శివసేన యూబీటీ నేత ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరూ మహిళల అంశాలను లేవనెత్తుతారని, ప్రతి ఒక్కరికీ మహిళల ఓట్లు కావాలని కానీ, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళల గురించి పట్టించుకోరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశా కిరణ్ షెల్టర్ హోంలో మానసిక వికలాంగులైన చిన్నారుల మృతికి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. మహిళలకు తప్పనిసరిగా న్యాయం జరగాలని ఆమె ఆకాంక్షించారు. మరోవైపు ఢిల్లీలోని ఆశా కిరణ్ షెల్టర్ హోంలో వెలుగుచూసిన మరణాలపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ స్పందించారు. గత 20 రోజులుగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశా కిరణ్ షెల్టర్ హోంలో 13 మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మరణాలకు కారణాలేంటనేది ఇప్పటివరకూ బయటపడలేదని అన్నారు. తాను ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్గా ఉన్న సమయంలో అక్కడి పరిస్ధితిని తనిఖీ చేశానని చెప్పారు. అక్కడి పరిస్ధితి ఏమీ బాగా లేదని, సరైన సిబ్బంది లేరని, వైద్యులు అందుబాటులో ఉండరని తెలిపారు. అప్పట్లో తాము దీనిపై నివేదిక రూపొందించి ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని, దీనిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తాను పార్లమెంట్లో లేవనెత్తుతానని స్వాతి మలివాల్ స్పష్టం చేశారు.
Read More :
Dog attacks | దారుణం.. ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కల దాడి