న్యూఢిల్లీ: డీప్‌ఫేక్‌లను నియంత్రించేందుకు చట్టపరమైన వ్యవస్థ కావాలని కోరుతూ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లు లోక్‌సభలో శివసేన సభ్యుడు శ్రీకాంత్ షిండే ప్రవేశపెట్టారు. డీప్‌ఫేక్ కంటెంట్‌లో చూపించే వ్యక్తుల నుంచి ముందస్తు ఆమోదం తప్పనిసరి చేస్తూ పౌరులను రక్షించే లక్ష్యంతో డీప్‌ఫేక్ నియంత్రణ బిల్లును షిండే శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
వేధింపులు, మోసాలు, తప్పుడు సమాచారం వ్యాప్తి కోసం డీప్‌ఫేక్‌ల దుర్వినియోగం పెరిగిపోయిందని బిల్లులో పేర్కొన్నారు. దురుద్దేశంతో డీప్‌ఫేక్‌లను సృష్టిస్తున్న దోషులపై జరిమానాలు విధించాలని బిల్లులో పేర్కొన్నారు. కృత్రిమ మేధలో ఆధునిక టెక్నాలజీ రావడం, డీప్ లెర్నింగ్ కారణంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ అక్రమార్కులకు ఆయుధంగా మారిందని షిండే తన బిల్లులో తెలిపారు.