కాంగ్రెస్ ప్రస్తుతం సంక్షోభం ముంగిట్లో వుందని తృణమూల్ నేత శత్రుఘ్న సిన్హా అన్నారు. తాను కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వచ్చానో ఈ సమయంలో చెప్పనని, అసలు తప్పులు ఎక్కడ జరిగాయో తరువాత చెబుతానని పేర్కొన్నారు. చాలా అంశాలున్నాయని, ఈ సంక్షోభ సమయంలో ఆ పార్టీపై విమర్శలు చేయనని అన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా తృణమూల్పైనే వుందని, అసన్సోల్ నుంచి బరిలోకి దిగుతున్నానని అన్నారు.
తాను తృణమూల్లో చేరడం వెనుక వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాత్ర చాలా వుందని శత్రుఘ్న సిన్హా వెల్లడించారు. పీకే తో పాటు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పాత్ర కూడా వుందని తెలిపారు. తృణమూల్లో చేరడం ఎంతో మర్యాదగా భావిస్తున్నారు. తృణమూల్లోనే వుంటాను. అసన్సోల్ నుంచి బరిలోకి దిగుతున్నాను. నేను తృణమూల్లో చేరడం వెనకు పీకే, యశ్వంత్ సిన్హా పాత్ర చాలా వుంది అని శత్రుఘ్న సిన్హా వెల్లడించారు.
బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ తృణమూల్ అభ్యర్థిని ప్రకటించారు. నటుడు నుంచి రాజకీయ నేతగా ఎదిగిన శత్రుఘ్న సిన్హాను తృణమూల్ అభ్యర్థిగా అసన్సోల్ నుంచి బరిలోకి దింపుతున్నామని సీఎం మమత ప్రకటించారు. ఇక… బాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, సింగర్ బబుల్ సుప్రియోను తృణమూల్ అభ్యర్థిగా బాలిగంజ్ నుంచి రంగంలోకి దింపుతున్నామని మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.