Shashi Tharoor | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ సొంత పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే చెప్తున్నాయి. పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో ఉన్న థరూర్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఓ కేంద్ర మంత్రితో సెల్ఫీ కూడా దిగి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తోపాటు బ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాథాన్ రెనాల్డ్స్‌ను కలుసుకోవడం సంతోషకరమని థరూర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో థరూర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారిని పొగడటం పరిపాటిగా మారింది. ఈ నెలారంభంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ తరువాత ప్రధాని మోదీ అమెరికా వెళ్లి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకొని చర్చలు జరపడాన్ని స్వాగతించారు.
కేరళ కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం ఏర్పడిందంటూ ఇటీవల సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. ఈ చర్యలన్నీ కాంగ్రెస్ అధిష్ఠానానికి థరూర్‌పై ఆగ్రహం తెప్పించాయి. పార్టీలో తనను పక్కన పెట్టారని భావిస్తున్న నేపథ్యంలోనే థరూర్ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో రాహుల్‌గాంధీ గత వారం థరూర్‌తో ఏకాంతంగా భేటీ అయ్యారు. అయినప్పటికీ థరూర్ కేంద్రంపై ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాను పార్టీ మారే అవకాశం లేదంటూ తనపై వస్తున్న ఊహాగానాలను ఖండించిన థరూర్.. ‘పార్టీకి నేను కావాలనుకుంటే.. ఉంటాను.. వద్దనుకుంటే, నాకు చేసుకోవడానికి వేరే పనులున్నాయి. నాకు ఇతర అవకాశాలు లేవని మాత్రం అనుకోవద్దు’ అని వ్యాఖ్యానించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కేరళ సీపీఎం థరూర్‌కు స్నేహ హస్తం అందించేందుకు సిద్ధమైంది. థరూర్ కాంగ్రెస్ పార్టీని వీడితే, కేరళ రాజకీయాల్లో అతడిని అనాథగా వదిలి పెట్టబోము అని సీపీఎం నాయకుడు థామస్ ఐజాక్ ప్రకటించారు.