న్యూఢిల్లీ: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) ఇవాళ ఓ లేఖ రిలీజ్ చేశారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని ఆయన తెలిపారు. ప్రారంభోత్సవానికి రావాలని తనకు ఆహ్వాన పత్రిక అందినట్లు ఆయన చెప్పారు. అయితే భారీ సంఖ్యలో రామభక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారని, జనవరి 22 తర్వాతే శ్రీరాముడి దర్శనం సులువు అవుతుందని, ఆ ఈవెంట్ తర్వాత అయోధ్య వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తన లేఖలో శరద్ పవార్ తెలిపారు.
విశ్వాసానికి, భక్తికి శ్రీరాముడు చిహ్నమని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆయన్ను ఆరాధిస్తారని, అయోధ్యలో జరగనున్న ప్రాణ ప్రతిష్ట పట్ల రామ భక్తుల్లో అత్యంత సంతోషం నెలకొన్నదని, ఈ చరిత్రాత్మక కార్యక్రమంలోని ఆనందం ఆ రామ భక్తుల నుంచి తనకు చేరుకుంటుందని, జనవరి 22 తర్వాత ఎప్పుడైనా రామ్ లల్లాను దర్శించుకోనున్నట్లు శరద్ పవార్ తన లేఖలో తెలిపారు. అయోధ్యకు తాను వెళ్లేనాటికి రామాలయ నిర్మాణం పూర్తి అవుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.