Sharad Pawar | మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కూలిపోతుందనే ప్రచారం జరుగుతున్నది. శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్ షిండే కొద్దిరోజులు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ క్రమంలో ఎన్సీపీ నేత శరద్ పవార్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమంటూ కొట్టిపడేశారు. సీఎం మార్పుపై తనకు ఏం తెలియదన్నారు. ఇటీవల మహారాష్ట్రలో కాబోయే ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంటూ పోస్టర్లు వెలిశాయి. కాబోయే ముఖ్యమంత్రి అజిత్ అంటూ పోస్టర్లు వేయడం మతిలేని చర్య అన్నారు.
అయితే, ఏక్నాథ్ షిండే రాజీనామాకు సిద్ధం కావాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించినట్లు శివసేన మౌత్ పీస్ సామ్నా ఓ కథనం ప్రచురించింది. దీంతో షిండే బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని, మనస్తాపంతో తన గ్రామానికి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉంటారని పేర్కొంది. అజిత్ పవార్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు మద్దతు ఇస్తున్నారని తెలిపింది. అయితే, అజిత్ పవార్ పార్టీ మార్పుపై స్పందిస్తూ.. తాను జీవితాంతం ఎన్సీపీలోనే ఉంటానని, శరాద్ పవర్ మార్గదర్శకత్వంలో పని చేస్తానని స్పష్టం చేశారు. అయితే, ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ మహావికాస్ అఘాది కూటమిలో కొనసాగుతున్నాయి. ఇటీవల కూటమిలోని విపక్షాల ఐక్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.