ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను పొగిడారు. (Sharad Pawar felicitates Shinde) దీంతో ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం దీనిపై మండిపడింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో విభేదాలు మరింతగా పెరిగినట్లు కనిపిస్తున్నది. ఫిబ్రవరి 11న జరిగిన 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సదస్సు సందర్భంగా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు ‘మహాద్జీ షిండే రాష్ట్ర గౌరవ్ పురస్కార్’ అవార్డును శరద్ పవార్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎంగా ఉన్నప్పుడు షిండే పరిపాలన, అభివృద్ధి విధానాన్ని ఆయన ప్రశంసించారు. తన సొంత జిల్లా సతారా నుంచి ఒకరు ముఖ్యమంత్రి కావడం పట్ల శరద్ పవార్ సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, శివసేన విభజనకు కారణమైన షిండేను శరద్ పవార్ సత్కరించడం పట్ల శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ దీనిపై మాట్లాడారు. షిండేను సత్కరించడం హోంమంత్రి అమిత్ షాను సత్కరించడం లాంటిదని విమర్శించారు. ‘రాజకీయాల్లో కొన్ని విషయాలను నివారించాలి. నిన్న శరద్ పవార్ షిండేను సత్కరించలేదు. అమిత్ షాను ఆయన సత్కరించారు. ఇది మా భావన. మీ ఢిల్లీ రాజకీయాలు మాకు అర్థం కాలేదు. కానీ మేం కూడా రాజకీయాలను అర్థం చేసుకున్నాం’ అని అన్నారు.
మరోవైపు సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై శరద్ పవార్ పార్టీ ఎంపీ అమోల్ కోల్హే స్పందించారు. ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇది సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమం అని, రాజకీయాల గురించి కాదని చెప్పారు. ‘ఆయన (శరద్ పవార్) రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. ప్రతిదానిలోకి రాజకీయాలు తీసుకురావద్దు. అందులో తప్పు లేదని నేను అనుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ఆయన (రిసెప్షన్ కమిటీ) అధ్యక్షుడు’ అని అన్నారు.