న్యూఢిల్లీ : పవార్ వర్సెస్ పవార్ వార్ ఢిల్లీకి చేరిన క్రమంలో మహారాష్ట్ర రాజకీయం (Maharashtra Politics) హస్తిన కేంద్రంగా రసవత్తరంగా సాగుతోంది. తమదే అసలైన ఎన్సీపీ అని శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు తలపడుతుండగా వ్యవహారం ఎన్నికల కమిషన్ (ఈసీ) చెంతకు చేరింది. ఇక ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీని ఫిరాయించి షిండే సర్కార్‌లో చేరిన మేనల్లుడు అజిత్ పవార్ సహా 9 మంది ఎమ్మెల్యేలను ఎన్సీపీ నుంచి బహిష్కరించారు.
మరోవైపు ఈ సమావేశం అక్రమమని, ఇలాంటి సమావేశాలకు పిలిచే అధికారం శరద్ పవార్‌కు లేదని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. ఇక అజిత్ పవార్ తిరుగుబాటులో ఎన్సీపీ నిట్టనిలువునా చీలడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టడంపై ఈ కీలక భేటీలో పార్టీ నేతలతో శరద్ పవార్ చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణుల్లో భరోసా నింపి దీటుగా ముందుకు వెళ్లడంపై చర్చించామని భేటీ అనంతరం పవార్ పేర్కొన్నారు.
తన వయసుపై అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వయసు సమస్య కాదని పనితీరు ముఖ్యమని, అజిత్ పవార్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని శరద్ పవార్ చెప్పారు. ఏ ఒక్కరు సీఎం కావాలని కోరుకున్నా దాంతో తనకు ఎలాంటి సమస్య లేదని, వారికి శుభాకాంక్షలు తెలుపుతానని అన్నారు. తాము ఈసీకి అన్ని అంశాలు వివరిస్తామని స్పష్టం చేశారు. విపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తోందని పవార్ ఆరోపించారు.
Read More :
Lalu Prasad Yadav: ప్రధాని ఎవరైనా.. భార్య లేకుండా ఉండొద్దు: లాలూ ప్రసాద్ యాదవ్