Sharad Pawar | ముంబై, జూలై 27: బహిష్కరణకు గురైన అమిత్ షా ఇవాళ దేశానికి హోంమంత్రి కావడం విచిత్రమని ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శించారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. దేశంలోని అవినీతి రాజకీయ నాయకులకు శరద్ పవార్ ముఠా నాయకుడని విమర్శించారు. ప్రభుత్వంలో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన రాజకీయ నేత శరద్ పవార్ మాత్రమేనని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అమిత్ షాకు కౌంటర్‌గా శరద్ పవార్ ప్రత్యారోపణలు చేశారు.
శుక్రవారం ఆయన ఎన్సీపీ నేతల సమావేశంలో మాట్లాడుతూ.. ‘గుజరాత్లో చట్టాన్ని దుర్వినియోగం చేసి, సుప్రీంకోర్టు ద్వారా బహిష్కరణకు గురైన వ్యక్తి ఇవాళ దేశానికి హోంమంత్రి కావడం విచిత్రం. కాబట్టి, మనం ఎటు వెళ్తున్నామో ఆలోచించాలి. లేకపోతే దేశం 100 శాతం తప్పు దారిలోకి వెళ్తుంది. దీనిపై మనం దృష్టి సారించాలి.’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో 2010లో అమిత్ షా రెండేండ్ల రాష్ట్ర బహిష్కరణకు గురయ్యారు. ఈ కేసులో 2014లో ఆయన నిర్దోషిగా తీర్పు వచ్చింది.