న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 : ఆర్థిక నేరం ఆరోపణల కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌పై ఉచ్చు బిగుస్తున్నది. కొచ్చి మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్)-ఎక్సలాజిక్ కంపెనీల ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. సీఎంఆర్ఎల్ నుంచి ఆమె కంపెనీ నెలవారీ మొత్తాలు అక్రమంగా అందుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) దాఖలు చేసిన చార్జిషీట్ మేరకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఈ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వీణాకు చెందిన ఎక్సలాజిక్ కంపెనీ.. సీఎంఆర్ఎల్ అనే మరో కంపెనీ నుంచి ఎలాంటి సేవలు అందించకుండానే అక్రమంగా 2.7 కోట్ల రూపాయలను పొందింది. ఆర్థిక నేరం ఆరోపణలపై ఇప్పటికే ప్రత్యేక కోర్టులోఆమెపై కేసు ఫైల్ అయ్యింది. ఆర్థిక నేరం కేసులో తన కుమార్తెపై కేసు నమోదైనందున ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ డిమాండ్ చేశారు.