హైదరాబాద్ : ఉత్తర్ప్రదేశ్లో గాలివాన బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులకు చెట్లు విరిగిపోయాయి. విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలకు 60 మంది చనిపోగా వందల మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఫతేపూర్, దేహత్ వంటి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది.
రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి (IMD) హెచ్చరించింది. తుపాను ప్రభావంతో విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.