న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు కొత్తగా రూపొందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు-2025లో నిబంధనలను కఠినతరం చేసింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. భారత్లోకి పాస్పోర్టు, వీసా లేకుండా ప్రవేశించే విదేశీయులకు రూ.5 లక్షల వరకు జరిమానా, ఐదేండ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చని ఈ బిల్లులో పొందుపరిచారు. డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి భారత్లోకి ప్రవేశించే వారికి ఏడేండ్ల వరకు జైలు శిక్ష, రూ.1-10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.