న్యూఢిల్లీ/జమ్ము, మే 9: పాక్‌తో సాయుధ ఘర్షణ జరుగుతున్న పరిస్థితిని అడ్డం పెట్టుకొని సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను హతం చేసినట్టు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. జమ్ములోని భారత్-పాక్ మధ్యనున్న అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారని తెలిపింది. సాంబా జిల్లాలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉగ్రవాదులతో కూడిన పెద్ద గుంపును తమ సర్వేలెన్స్ గ్రిడ్ గుర్తించిందని పేర్కొంది.
ధన్దార్ పోస్టు నుంచి పాకిస్థాన్ రేంజర్లు ఓవైపు భారత్‌పై కాల్పులు జరుపుతుండగా, వాటి ఆసరాగా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారని వివరించింది. బీఎస్ఎఫ్ దళాలు చొరబాటుదారులపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయని, ఈ కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారని, ధన్దార్ పోస్టు కూడా భారీగా ధ్వంసమైందని తెలిపింది. మరణించిన ఉగ్రవాదుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చునని అధికారులు పేర్కొన్నారు. బీఎస్ఎఫ్ కాల్పుల్లో బంకర్ ధ్వంసమైన దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియోను బీఎస్ఎఫ్ విడుదల చేసింది.