శ్రీనగర్: భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు, ఎదురుదాడుల వేళ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు ముష్కరులు (Terrorists) యత్నించారు. గుర్తించిన సరిహద్దు రక్షణ దళం (BSF) వారిని మట్టుబెట్టింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అక్రమ చొరబాట్లకు అనువుగా పాకిస్థాన్ సైన్యం డ్రోన్లు, చిన్నపాటి మిసైళ్లతో దాడులకు పాల్పడింది. ఇదే అదనుగా ఏడుగురు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరిపి అంతమొందించింది. దీనిని బీఎస్ఎఫ్ ఎక్స్ వేదికగా నిర్ధారించింది.
గురువారం రాత్రి 11 గంటల సమయంలో సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి చొరబాట్లను బీఎస్ఎఫ్ అడ్డుకున్నదని, ఏడుగురు చొరబాటుదారులను అంతమొందించినట్లు అర్ధరాత్రి ఒంటి గంటకు ట్వీట్ చేసింది.
కాగా, చొరబాటుదారులంతా జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు అనుమానిస్తున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు.