Seven Killed | తమిళనాడులోని తిరువణ్ణామలైలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయాయి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణగిరిలో బస్సులు వరదకు కొట్టుకుపోయాయి. విజుపురం, కడలూరులో వర్షాలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలైలో భారీ వర్షం కురిసింది. దీంతో అన్నామలయార్ కొండచరియలు విరిగి మూడు ఇండ్లపై పడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. అయితే, 1965 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో తొలిసారిగా భారీ వర్షాపాతం నమోదైందని మంత్రి ఈవీ వేలు పేర్కొన్నారు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో 50 మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. కృష్ణగిరిలో గత 24గంటల్లో 50 సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం రికార్డయ్యింది. ఊతంకర బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులు కొట్టుకుపోయాయి. పోచంపల్లి పోలీస్ స్టేషన్ కూడా మునిగిపోయింది. ఇండ్లలోకి చేరు చేరింది. విజుపురం, కడలూరులోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ వరదలతో అల్లాడుతున్నాయి. విజుపురంలోనే 49 సహాయ శిబిరాలు అధికారులు ఏర్పాటు చేశారు. చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ సహా 10 రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజుపురం వద్ద ట్రాక్‌లోకి నీరు చేరింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజుపురంలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. సేలంలోని యెర్కాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. పుదుచ్చేరిలో వర్షం ఆగడంతో చాలా చోట్ల నీరు తగ్గుముఖం పట్టింది.