Maoists | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా ధృవీకరించారు. ఈ ఏడుగురిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవాళ జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని సమాచారం.
మృతులను మావోయిస్టులు జోగారావు అలియాస్ టెక్ శంకర్, సీత అలియాస్ జ్యోతి, సురేశ్, గణేశ్, వాసు, అనిత, షమ్మిగా పోలీసులు గుర్తించారు. మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
నిన్న పట్టుబడ్డ 50 మంది మావోయిస్టులను ఇవాళ విజయవాడలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహేశ్ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టి.. మావోయిస్టుల కదలికలను గమనించారు. నవంబర్ 17న ఒక ఆపరేషన్ ప్రారంభించాం. 18న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.
ఇక ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామన్నారు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్ మెంబర్లు 23 మంది, డివిజినల్ కమిటీ మెంబర్లు ఐదుగురు, ఏరియా కమిటీ మెంబర్స్ 19 మంది ఉన్నట్లు తెలిపారు. పట్టుబడ్డ మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.