Bengaluru : కర్ణాటకలోని బెంగళూరు పరిధిలో దారుణం జరిగింది. ఒక రాళ్ల క్వారీలో పెద్ద రాళ్లు మీద పడటంతో ఏడుగురు కూలీలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు, దక్షిణ తాలూకా, మదపట్టణ వద్ద గురువారం వేకువఝామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఒక క్వారీ వద్ద గురువారం ఉదయం ఎప్పట్లాగే పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కావేరీ సంస్థకు చెందిన దాదాపు 15-20 మంది కూలీలు పని చేస్తున్నారు. ఈ కూలీలంతా బిహార్‌కు చెందిన వారే. గురువారం ఈ ప్రాంతంలో క్వారీ పనులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో కొందరు కూలీలు బండతో నిర్మితమైన చిన్న పర్వతం దిగువ భాగంలో పనులు చేస్తున్నారు. ఈ పర్వతంపైన హిటాచి మెషీన్‌తో తవ్వకాలు, ఇతర పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పర్వతంపై పెద్ద బండలను మెషీన్‌తో తొలగించేందుకు ప్రయత్నించగా, పైనుంచి ఆ బండలు కింద ఉన్న కార్మికులపై పడ్డాయి. వంద అడుగుల ఎత్తు నుంచి రాళ్లు మీద పడటంతో పర్వతం దిగువ భాగంలో పని చేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ప్రమాద స్థలంలో కూలీలపై పెద్దపెద్ద బండరాళ్లు పడి ఉన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రాంతం మొత్తాన్ని అధికారుల అధీనంలోకి తీసుకున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా కూలీలు ఉన్నారా అనే కోణంలో వెతుకుతున్నారు.
పర్వతంపైన హిటాచీతో పనులు జరగడం.. ఈ పర్వతం దిగువన కూలీలు పనిచేస్తున్న విషయాన్ని పైన ఉన్న హిటాచీ ఆపరేటర్ గుర్తించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల కుటుంబాలను సంప్రదిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బిహార్ కూలీలు బెంగళూరు పరిధిలో మరణించడంపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్వారీలలో కూలీలకు యాజమాన్యాలు భద్రత కల్పించాలని సూచించారు. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.