ఇండోర్: దేశంలోనే స్వచ్ఛ నగరంగా పేర్కొనే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు తాగి ఏడుగురు మరణించగా 100 మందికిపైగా అనారోగ్యానికి గురై దవాఖానలో చేరారు. ఇప్పటివరకు మూడు మరణాలను అధికారికంగా ధృవీకరించారు. మరో నలుగురి మరణం గురించి కూడా తమకు సమాచారం అందిందని ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ చెప్పారు.
మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన జోనల్ అధికారిని, అసిస్టెంట్ ఇంజినీర్ని సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇన్చార్జ్ సబ్-ఇంజినీర్ని విధుల నుంచి తొలగించింది. మృతులకు సంతాపాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్‌కు లోనైనట్లు రోగులు తెలిపారని హెల్త్ ఆఫీసర్ మాధవ్ ప్రసాద్ హసానీ తెలిపారు.