కోల్‌కతా, జనవరి 8/(స్పెషల్ టాస్క్ బ్యూరో): 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు యథేచ్ఛగా పెరిగిపోయాయి. ఒకానొక దశలో ఈ పరిణామంపై కోర్టులు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అయినప్పటికీ, ఈడీ, సీబీఐ, ఐటీ పోకడ మారట్లేదు. బెంగాల్లో గురువారం జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మొన్నటివరకూ ప్రత్యర్థులను బ్లాక్మెయిల్ చేయడానికి ఏజెన్సీలను వాడిన బీజేపీ.. ఇప్పుడు వ్యూహాల తస్కరణకూ వాడుతున్నదా? అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు ఎన్నికల వ్యూహరచన చేస్తున్న రాజకీయ కన్సల్టెన్సీ గ్రూప్ ఐ-ప్యాక్ కార్యాలయాలపై గురువారం ఈడీ దాడులు నిర్వహించింది. సెంట్రల్ కోల్‌కతాలోని లౌడన్ స్ట్రీట్‌లో ఉన్న ఐ-ప్యాక్ అధిపతి ప్రతీక్ జైన్ నివాసం, కార్యాలయంతోపాటు సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ మరో ఆఫీస్‌లోనూ ఈ సోదాలు జరిగాయి. అయితే, ఈ సోదాలు కొనసాగుతున్న సమయంలో జైన్ నివాసానికి కోల్‌కతా పోలీసు బాస్ వినీత్ గోయల్ చేరుకున్నారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే అక్కడకు చేరుకొన్న బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లోపలికి వెళ్లారు.
కొంత సమయం తర్వాత ఆకుపచ్చ రంగు ఫైలు పట్టుకుని బయటకు వచ్చారు. అనంతరం అక్కడే ఉన్న మీడియాతో మమత మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఈడీ దాడులు రాజకీయ ప్రోద్బలంతో జరిగినవని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ దాడుల వెనుక ఉన్నారని, టీఎంసీ ఎన్నికల వ్యూహాన్ని, 2026 ఎన్నికల అభ్యర్థుల జాబితాలను, పార్టీకి చెందిన రహస్య పత్రాలను కాజేసేందుకే ఈ దాడులకు ఆదేశించారని మమత ఆరోపించారు. టీఎంసీ ఎన్నికల వ్యూహానికి సంబంధించిన ఫైళ్లను చోరీ చేశారని ఈడీని నిందించారు.
జైన్ నివాసం నుంచి బయల్దేరిన మమత నేరుగా 15 కిలోమీటర్ల దూరంలోని ఐ-ప్యాక్ సాల్ట్ లేక్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే, ఈడీకి చెందిన మరో బృందం అక్కడ సోదాలు నిర్వహిస్తున్నది. దీంతో కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన మమత దొడ్డిదారిన లోపలకు ప్రవేశించారు. 15-20 నిమిషాల తర్వాత ఆమె అక్కడ నుంచి నిష్క్రమించారు. ఆమె వెనుక సీఎం కార్యాలయం(సీఎంఓ)లో పనిచేసే పలువురు అధికారులు అనేక ఫైళ్లు మోసుకుంటూ బయటకువచ్చారు. మమత వచ్చిన కారు వెనుక సీటులో ఈ ఫైళ్లను ఉంచారు. కాగా, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బెంగాల్ బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అవినీతి సొమ్ము ఐ-ప్యాక్‌కు చేరినట్లు ఈడీ ఆరోపించింది.
2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అంతకు ముందు ఎన్నికల్లో 3 సీట్లకు పరిమితమైన బీజేపీ 2021 ఎన్నికల్లో ఏకంగా 77 స్థానాలకు ఎగబాకింది. 38 శాతానికి పైగా ఓట్లను కైవసం చేసుకొన్నది. అయినప్పటికీ, ఐ-ప్యాక్ టీమ్ వ్యూహాలను అనుసరించిన మమత పార్టీ.. ఆ ఎన్నికల్లో మంచి మెజారిటీ తోనే అధికారంలోకి వచ్చింది. కాగా మరో నాలుగు నెలల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో టీఎంసీ గెలుపునకు అవసరమైన వ్యూహాలను ఐ-ప్యాక్ టీమ్ ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం.
ఈ విషయాన్ని బీజేపీ నేతలకు ఎవరో ఉప్పందించారని వార్తలు వస్తున్నాయి. దీంతో మనీలాండరింగ్ కేసు పేరిట ఆ కీలక ఎన్నికల వ్యూహాల సమాచారాన్ని తీసుకోవడానికి బీజేపీ ఈడీని రంగంలోకి దింపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మమత వచ్చేసరికి వ్యూహాలకు సంబంధించిన కీలక డాటా, హార్డ్‌డిస్క్‌లు, పత్రాలను ఈడీ అధికారులు తరలించారని ఈ ఘటనతో సన్నిహితంగా ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. తాను తీసుకొచ్చిన ఫైల్స్‌లో ఏమీలేదని తెలుసుకొన్న మమత.. ప్రస్తుతం ఆందోళనలో ఉన్నట్టు టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఎన్నికల ముందు బెంగాల్లో జరిగిన ఈ పరిణామం రాజకీయంగా సంచలనంగా మారింది.
సీఎం మమతా బెనర్జీ, ఆమె అనుచరులు, రాష్ట్ర పోలీసు అధికారులు బలవంతంగా ఫైళ్లను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ఎత్తుకుపోయారని కలకత్తా హైకోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. తమ దాడులు ఏ రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకున్నవి కావని, అవి ఎన్నికలకు సంబంధించినవి కూడా కావని తెలిపింది.