PUBG Love Story | న్యూఢిల్లీ, జూలై 18: పబ్జీ ఆటలో కుదురిన ప్రేమ పేరుతో భారత్‌లోకి ప్రవేశించి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా అనే వ్యక్తిని పెండ్లి చేసుకొన్న పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన సీమా హైదర్ అనే మహిళ కథ అంతా ఉత్తిదేనా? లేదా పక్కా ప్రణాళికతో ఆమె భారత్‌కు వచ్చిందా? సీమా హైదర్ పాక్ ఆర్మీ, ఆ దేశ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఏజెంటా?.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. యూపీ యాంటీ టెర్రరిస్టు స్వాడ్(ఏటీఎస్) ఇదే కోణంలో విచారణ జరుపుతున్నది. దుబాయ్ నుంచి నేపాల్ మీదుగా ఈ ఏడాది మేలో వీసా లేకుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్‌ను ఏటీఎస్ పోలీసులు ఈనెల 4న అరెస్టు చేశారు. సీమా హైదర్‌తో పాటు సచిన్ మీనా, అతని తండ్రిని కూడా ఓ రహస్య స్థలంలో ఉంచి ఏటీఎస్ పోలీసులు మంగళవారం వరుసగా రెండో రోజు ప్రశ్నించారు. అవసరమైతే, సీమా హైదర్‌ను ఏటీఎస్ అదుపులోకి తీసుకొనే అవకాశం కూడా ఉన్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీమా హైదర్ అక్రమ ప్రవేశాన్ని నిగ్గు తేల్చేందుకు యూపీ ఏటీఎస్‌తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కూడా రంగంలోకి దిగింది.
తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సీమా హైదర్, సచిన్ మీనాతో ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటున్నది. సీమా హైదర్ చిన్నాన్న, ఆమె సోదరుడు పాకిస్థాన్ సైన్యంలో పనిచేస్తున్నట్టు సమాచారం. ఆమె తన మొబైల్ ఫోన్ నుంచి తొలగించిన డాటాను రీస్టోర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అసలు సీమా హైదర్ సరిహద్దుల్లో సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) కన్నుగప్పి దేశంలోకి ఎలా ప్రవేశించింది? అనేదానిపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. సీమా హైదర్ ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, ఆమె పిల్లలకు సంబంధించిన ఇతర పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఇటీవల ఓ అనుమానాస్పద వ్యక్తిని లక్నోలో అరెస్టు చేసిన తర్వాత తాజా పరిణామాలు చోటుచేసుకొన్నాయి. భారత రక్షణ రంగానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అతను సరిహద్దులోని తన సహచరులతో పంచుకొంటున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
విచారణ సందర్భంగా అధికారులు సీమా హైదర్‌కు పలు కీలక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంగా 5వ తరగతి చదివిన ఆమె ఇంగ్లిష్ స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం విచారణ తర్వాత హైదర్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నదని, ఆమె నుంచి ముఖ్యమైన విషయాలకు సమాధానాలు రాబట్టడం సులువేం కాదని ఏటీఎస్ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నాయి. మరోవైపు, సీమా హైదర్ పాకిస్థాన్ ఏజెంట్ అని, ఆమెను తిరిగి ఆ దేశానికి పంపాలని గుర్తుతెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు మెసేజ్ పంపారు. ఈ బెదిరింపు సందేశంపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. తాను హిందువుగా మారిపోయానని, సచిన్ మీనాతోనే ఉంటానని, పాక్‌కు వెళ్లనని సీమా హైదర్ చెబుతున్నది. మరోవైపు తన భార్యాపిల్లలను పాకిస్థాన్‌కు పంపాలని, వారితో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్టు ఆమె నుంచి విడిపోయిన భర్త గులాం హైదర్ అభ్యర్థించాడు.