PUBG Love Story | భారత్- పాకిస్థాన్ సరిహద్దులు దాటిన ప్రేమలో ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. పబ్జీలో పరిచయమైన ఓ యువకుడి కోసం నలుగురు పిల్లల తల్లి ఏకంగా దేశాన్నే విడిచిపెట్టి వచ్చింది. భర్తకు తెలియకుండా ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో భారత్‌కు పారిపోయి వచ్చేసింది. తన ప్రియుడిని పెళ్లాడి కాపురం కూడా పెట్టింది. చివరకు పోలీసులకు దొరికిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంత జరిగినా ఆమె మొదటి భర్త మాత్రం తనే కావాలని అంటున్నాడు. ఆమెను ఎలాగైనా పాకిస్థాన్ పంపించాలని వేడుకుంటున్నాడు. కానీ ఆమె మాత్రం పాక్‌కు వెళ్లేందుకు ససేమిరా అంటోంది. చావైనా బతుకైనా ఇక్కడే అని మొండికేసుకుని కూర్చొంది.
అది కరోనా లాక్డౌన్ సమయం.. జనలంతా ఇంటి పట్టునే ఉండి ఫోన్లకు అతుక్కుపోయిన రోజులు.. ఆ టైమ్‌లో పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన సీమా హైదర్ (30 ) కూడా పబ్జీకి బానిసైంది. భర్త సౌదీలో కష్టపడి పనిచేసి డబ్బులు పంపిస్తుంటే.. ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేసింది. అప్పుడే పబ్జీ గేమ్‌లో సీమా హైదర్‌కు భారత్‌లోని నోయిడాకు చెందిన సచిన్ మీనా అనే పాతికేళ్ల యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య స్నేహంగా మారింది. కొద్దిరోజుల్లోనే ప్రేమలో కూడా పడింది. తనకు అప్పటికే పెండ్లయి నలుగురు పిల్లలు ఉన్న విషయాన్ని కూడా మరిచిపోయి సచిన్ ప్రేమలో మునిగిపోయింది.
అలా ఏండ్లు గడిచిపోయాయి. ఇంకా ఎన్ని రోజులు అని ఇలా ఫోన్లోనే ప్రేమించుకుంటాం.. కండ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ ప్రేమ సాగరాలు ఈదకూడదా అని అనుకున్నారు. అంతే ఎలాగైనా కలుసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ ఒకరిది భారత్, మరొకరది పాకిస్థాన్.. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది.. మరి కలుసుకోవడం ఎలా అని తెగ మదనపడిపోయారు. చివరకు నేపాల్‌లో మీట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది మార్చిలో సీమా ముందుగా దుబాయ్ వెళ్లింది.. అక్కడి నుంచి నేపాల్‌కు చేరుకుంది. సచిన్‌ను కలుసుకుంది. దాదాపు ఫోన్లో పరిచయమైన మూడేండ్లకు తొలిసారిగా ఎదెరుదురు పడటంతో ఇద్దరూ ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే పెండ్లి చేసుకున్నారు. ప్రపంచాన్ని మరిచిపోయేలా కొద్దిరోజులు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ ఇండ్లకు చేరుకున్నారు.
ఎవరి ఇండ్లకు వాళ్లు చేరుకున్నారు కానీ.. ఇద్దరికీ మరొకరి గురించే ఆలోచనలు. ఇద్దరూ విరహ వేదనను తట్టుకోలేకపోయారు. సీమా అయితే సచిన్‌తోనే ఉండిపోవాలని.. అతని సాన్నిహిత్యం కోసం పరితపించిపోయింది. దీంతో తన మొదటి భర్తతో గొడవ పడింది. పాకిస్థాన్‌లో తమకు ఉన్న ఓ ఫ్లాట్‌ను 12 లక్షల పాకిస్థానీ రూపాయలకు అమ్మేసింది. ఆ డబ్బుతో తన పిల్లలను తీసుకుని ఇండియా వచ్చేందుకు స్కెచ్ వేసింది. ఈ ఏడాది మేలో తన పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లింది. అక్కడి నుంచి నేపాల్‌లోని పోఖరాకు వచ్చింది. అక్కడ కొద్దిరోజులు గడిపి.. ఖాఠ్మాండూకు చేరుకుంది. మే 13 ఖాఠ్మాండూ నుంచి బస్సులో ఢిల్లీకి వచ్చి సచిన్‌ను కలుసుకుంది.
Pubg Love
తన కోసం పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్‌ను తీసుకెళ్లి సచిన్ గ్రేటర్ నోయిడాలోని ఒక అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు సచిన్. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న తరుణంలో జూలై 4వ తేదీన గ్రేటర్ నోయిడాలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దొరికిపోయారు. సోదాలు నిర్వహించిన సమయంలో సీమా తీరు అనుమానస్పదంగా కనిపించడంతో విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో అక్రమంగా దేశంలోకి చొరబడినందు సీమాను.. చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ను, అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా వీళ్ల ముగ్గురికి బెయిల్ మంజూరైంది. సీమాను తిరిగి పాకిస్థాన్ పంపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తుంటే.. ఆమె మాత్రం ససేమిరా అంటోంది. తన భర్త సచిన్‌తోనే ఉంటానని.. పాకిస్థాన్ తిరిగి వెళ్లనని చెబుతోంది.’ నా భర్త హిందువు.. అతనిది హిందూస్థాన్.. అంటే నాది కూడా హిందూస్థానీనే.. నేను కూడా ఇక్కడే ఉంటా. ‘ అని తెగేసి చెప్పింది.
నా మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసి పాకిస్థాన్ నుంచి ఇండియా వచ్చానని సీమా హైదర్ చెబుతోంది. కానీ ఆమె మొదటి భర్త గులామ్ హైదర్ మాత్రం తాము డైవర్స్ తీసుకోలేదని స్పష్టం చేశాడు. భారతీయ మీడియాలో వచ్చిన వార్తలు చూసి తన భార్య సీమా గురించి తెలుసుకున్నానని తెలిపారు. తన భార్యను ఎలాగైనా పాకిస్థాన్ పంపించాలని ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో సందేశం పంపించాడు. నా భార్య, నలుగురు పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ సౌదీలో రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తున్నా. కానీ నా భార్యను ఎవరో ట్రాప్ చేశారు. కావాలనే తనతో పరిచయం పెంచుకుని భారత్‌కు రప్పించారు. నా కుటుంబాన్ని నాతో కలపండి.. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా మోదీజీ అంటూ వీడియో పోస్టు చేశాడు.