న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి బాధితులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి భద్రతా బలగాలు, దర్యాప్తు బృందాలు కీలక విషయాలను సేకరిస్తున్నారు. పర్యాటకులు తప్పించుకోకుండా బైసరన్ వ్యాలీలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌ను ఉగ్రవాదులు బ్లాక్ చేశారని తెలిసింది. ఎగ్జిట్ పాయింట్ వద్ద ఒక ఉగ్రవాది తొలుత కాల్పులు జరపటంతో, పర్యాటకులు ఎంట్రీ పాయింట్ వైపునకు పరిగెత్తారని, అక్కడ కాపు కాచిన ఉగ్రవాదులు వాళ్లను చుట్టుముట్టి కాల్పులు జరిపినట్టు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.
వాస్తవానికి, ఏప్రిల్ 22 కంటే రెండ్రోజుల ముందే పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసేందుకు పథకం వేసినట్టు సమాచారం. అయితే 20న అక్కడ భారీ వర్షం కురిసింది. చాలా మంది పర్యాటకులు పహల్గాం సందర్శన వాయిదా వేసుకున్నారు. దీంతో ఉగ్రవాదులు తమ దాడిని 22వ తేదీకి వాయిదా వేసుకున్నట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి.