Parliament | న్యూఢిల్లీ, ఆగస్టు 16: పార్లమెంట్ భవనంలో భద్రతా లోపం మరోసారి బయటపడింది. 20 ఏండ్ల వయసున్న యువకుడొకరు గోడ ఎక్కి పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆ యువకుడు గోడ ఎక్కి పార్లమెంట్ అనెక్స్ భవన ప్రాంగణంలోకి దూకాడు. పార్లమెంట్ భద్రతను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అరెస్ట్ చేసి ఢిల్లీలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడి వద్ద అనుమానాస్పద వస్తువులేవీ లేవు. అతడిని యూపీలోని అలీగఢ్‌కు చెందిన మనీశ్‌గా గుర్తించారు. అతను మతిస్థిమితం లేనివాడిలా కన్పిస్తున్నాడని, అతని పేరును కూడా సరిగ్గా చెప్పలేకపోయాడని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర బలగాలు కూడా అతడిని ప్రశ్నిస్తున్నాయని ఆ అధికారి చెప్పారు.
ముంబై, ఆగస్టు 16, (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్ ఉద్యోగం పొందిన పూజా ఖేద్కర్లానే దేశంలో మరో 22 మంది అధికారులు ఉన్నారని మహారాష్ట్రకు చెందిన ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్ ఆరోపించారు. వీరు కుల, జన్మ ధ్రువీకరణ, వైకల్యం వంటి వాటికి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇలా నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్గా పని చేస్తున్నారని చెప్పారు. ఈ అధికారులపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.