న్యూఢిల్లీ, నవంబర్ 2 : కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) ఓ దళిత బాలుడి పట్ల ప్రభుత్వ పాఠశాల (Government School) ఉపాధ్యాయులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అతడ్ని ఇష్టమున్నట్టు కొట్టడమేగాక, బాలుడి ప్యాంట్లో తేలును వదిలి.. అత్యంత దారుణంగా హింసించారు. సిమ్లా జిల్లాలోని ఖద్దపాని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు స్కూల్ హెడ్మాస్టర్ సహా మరో ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు నమోదుచేశారు. తన కుమారుడ్ని స్కూల్ టీచర్లు ఏడాది కాలంగా భౌతికంగా హింసిస్తున్నారని బాలుడి తండ్రి దేవేంద్ర ఆరోపించారు. తరుచూ కొట్టడం వల్ల పిల్లవాడి చెవిలో రక్తస్రావం జరిగి సున్నితభాగాలు దెబ్బతిన్నాయని తండ్రి చెప్పారు.
ఉపాధ్యాయులు తన కొడుకును పాఠశాల టాయిలెట్‌కు తీసుకుపోయి, అక్కడ అతడి ప్యాంట్లో తేలును వదిలిపెట్టారని ఆరోపించాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితులపై పోలీసులు కేసు నమోదుచేశారు. స్కూల్లో నేపాలీ, హరిజన విద్యార్థులపై కుల వివక్ష చూపుతూ, రాజ్‌పుత్ విద్యార్థుల నుంచి దూరంగా కూర్చోబెడుతున్నారని తండ్రి ఆరోపించాడు. ఈ కేసుకు సంబంధించి గెజిటెడ్ స్థాయి అధికారితో విచారణ జరపాలా? లేదా? అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్థానిక పోలీస్ అధికారి చెప్పారు. రోహ్రూలోని ఉపాధ్యాయులు విద్యార్థులను కొట్టడం, వారిపై కుల వివక్ష ఆరోపణలు రావటం ఇదేమీ మొదటిసారి కాదు.