Teacher | భోపాల్: విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడు వారిని పెడదారి పట్టించి దొరికిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని కత్ని జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ తన వద్ద చదువుకుంటున్న విద్యార్థుల చేత మద్యం తాగించారని తెలిసి జిల్లా అధికారులు ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు.
ఖిర్హానీ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచర్ నవీన్ ప్రతాప్ సింగ్ కప్పులలో మద్యం పోసి విద్యార్థులకు అందచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. తాగే ముందు అందులో నీళ్లు కలుపుకోవాలంటూ విద్యార్థులకు టీచర్ సలహా ఇవ్వడం కూడా అందులో వినిపించింది. ఉపాధ్యాయ వృత్తి గౌరవ మర్యాదలను దెబ్బ తీసినందుకు నవీన్ ప్రతాప్ సింగ్‌ని సస్పెండ్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.