Senthil Balaji | మనీలాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే డీఎంకే నేత వీ సెంథిల్ బాలాజీకి తమిళనాడు ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించడంపై ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, బాలాజీకి బెయిల్ మంజూరు చేస్తూ సెప్టెంబర్ 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సెంథిల్ బాలాజీ బెయిల్‌పై బయటకు వచ్చిన మరుసటి రోజునే ఆయన తమిళనాడు కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పిటిషనర్ పేర్కొన్నారు.
మంత్రి బాలాజీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్గతీ కోర్టుకు హాజరయ్యారు. అయితే, బెయిల్‌పై విడుదలైన గంటల్లోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని.. మంత్రి కావడంతో సాక్షులను ప్రభావితమవుతారనే సందేహాలు వస్తాయన్న ధర్మాసనం.. అసలు అక్కడ ఏం జరుగుతోందని ప్రశ్నించింది. బెయిల్ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని.. బెయిల్‌పై రద్దుకు సంబంధించి విచారణ జరిపేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, సాక్షులు ప్రభావితం అవుతారనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని.. దీనిపై విచారణ జరుపుతామని జస్టిస్ ఓకా తెలిపారు. కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. క్యాష్ ఫర్ జాబ్ స్కామ్‌పై ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో ఒకరైన కే విద్యాకుమార్ సుప్రీంకోర్టులో తాజాగా ఈ పిటిషన్ దాఖలు చేశారు.
బెయిల్ పొందిన వెంటనే కేబినెట్ మంత్రి పదవి చేపట్టడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మనీలాండరింగ్ కేసులో డీఎంకే నేతకు సెప్టెంబర్ 26న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన 29న కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ సమయంలో తమిళనాడులోని స్టాలిన్ సర్కారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నలుగురు మంత్రులు ప్రమాణం చేశారు. ఇందులో బాలాజీ ఒకరు. కరూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలాజీని గతేడాది జూన్ 14న ఈడీ అరెస్టు చేసింది. బాలాజీ 2011-2015 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.