న్యూఢిల్లీ: మణిపూర్లో చెలరేగిన హింస, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన, ఇతర అల్లర్లకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తున్న 17 కేసుల విచారణను అస్సాంకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ కేసులను వేగంగా విచారించడానికి ఎంతమంది అవసరమైతే అంతమంది జడ్జీలను నామినేట్ చేయాలని గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్ను ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల విచారణను మణిపూర్ నుంచి అస్సాంకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు మొత్తం 17 కేసులను అస్సాంకు బదిలీ చేసింది.
ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ ‘మణిపూర్లో చెలరేగిన హింస వల్ల కుకీ, మైతీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులను అస్సాంలో విచారించడమే ఉత్తమం’ అని తెలిపారు. బాధితుల విచారణ, సాక్షుల వాంగ్మూలం నమోదు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరుగాలని సూచించారు. మణిపూర్ హింస బాధితులకు పునరావాసం, వసతుల కల్పనపై ఏర్పాటైన ముగ్గురు మహిళా జడ్జీల కమిటీ మూడు నివేదికలను సుప్రీంకోర్టుకు అందజేసింది.