న్యూఢిల్లీ : రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడానికి సంబంధించి రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం తన అభిప్రాయాన్ని వెలువరించనున్నది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం రాష్ట్రపతి నివేదనపై సెప్టెంబర్ 11 నుంచి 10 రోజులపాటు విచారణ జరిపి తన అభిప్రాయాన్ని వాయిదా వేసింది.
ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద పెండింగ్లో ఉన్న 10 బిల్లులకు ఆయన ఆమోదం లేకుండానే నోటిఫై చేసుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ వీటిని రాష్ట్రపతికి నివేదించడాన్ని చట్టవిరుద్ధం, తప్పిదంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులకు మూడు నెలల్లో ఆమోదం తెలియచేయాలని, లేని పక్షంలో ఎందుకు జాప్యం జరిగిందో కారణాన్ని రాష్ర్టానికి తెలియచేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో ఆదేశించింది.