Supreme Court | న్యూఢిల్లీ, నవంబర్ 6: బీజేపీ పాలిత యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తప్పుబట్టింది. ఇష్టమొచ్చినట్టు పౌరుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్యాయంగా ఒక పౌరుడి ఇంటిని నేలమట్టం చేసినందుకు యోగి ప్రభుత్వానికి జరిమానా విధించింది. చట్టపరమైన ప్రక్రియ పాటించకుండా ఇంటిని కూల్చివేయడాన్ని తప్పుబడుతూ ఎలాంటి గడువు ఇవ్వకుండా రాత్రికి రాత్రే పౌరుల ఇళ్లను కూల్చివేయడం సబబు కాదని పేర్కొంది.
దేనికైనా చట్టపరమైన విధానాన్ని అనుసరించాల్సిందేనని స్పష్టంచేసింది. బాధితుడికి యోగి ప్రభుత్వం రూ.25 లక్షలు పరిహారంగా చెల్లించాలని, ఈ కూల్చివేతకు ఎవరెవరు బాధ్యులో నిర్ధారించడానికి విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ, ఆక్రమణల తొలగింపు సమయంలో రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సుప్రీం కోర్టు జారీ చేసింది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 2020కు సంబంధించిన ఒక సుమోటో కేసును బుధవారం విచారించింది. రహదారి ఆక్రమణ ఆరోపణపై 2019లో తన ఇంటిని యూపీ ప్రభుత్వం కూల్చివేసిందని మనోజ్ టిబ్రేవాల్ ఆకాశ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన ధర్మాసనం..
‘ఈ కేసులో ఇంటి కూల్చివేతలో ఎలాంటి చట్టపరమైన నిబంధనలు పాటించలేదు. రోడ్డు నిర్మాణంలో అక్రమాలు జరిగినట్టు తాను వార్తాకథనాన్ని ప్రచురించినందుకు ప్రభుత్వం ఈ కక్ష సాధింపునకు పాల్పడినట్టు పిటిషనర్ ఆరోపించారు. రాష్ట్రం అటువంటి చర్యకు పాల్పడటాన్ని సహించ లేము. ప్రైవేట్ ఆస్తితో వ్యవహరించేటప్పుడు చట్టాన్ని అనుసరించాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
పిటిషనర్ ప్రభుత్వ భూమిని ఆక్రమించాడని యూపీ ప్రభుత్వం చేసిన వాదనపై కోర్టు స్పందిస్తూ ‘పిటిషనర్ 3.7 చదరపు మీటర్ల భూమిని ఆక్రమించాడని మీరు అంటున్నారు. ఈ విషయంలో మేమేమీ అతన్ని వెనకేసుకు రావడం లేదు. అతని ఆక్రమణ నిజమేనని అనుకుందాం. అయినా చట్టాలను అతిక్రమించి మీరు అతడి ఇంటిని ఎలా కూలగొట్టారు? ఎవరి ఇంటిలోకైనా ఇలా చొరబడటం అధర్మం కాదా?’ అని యూపీ ప్రభుత్వం తరపున హాజరైన కౌన్సిల్ను సీజేఐ ప్రశ్నించారు.
‘రాత్రికి రాత్రే ఇలా ఇళ్లు కూలగొట్టడానికి మీరు బుల్డోజర్లతో రాకూడదు. మీరు వారి కుటుంబానికి కనీసం ఎలాంటి సమయం కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇంటిలో ఉన్న వస్తువుల సంగతేంటి? దేనికైనా చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలి కదా?’ అని ధర్మాసనంలో సభ్యునిగా ఉన్న మరో న్యాయమూర్తి జస్టిస్ పార్థివాలా ప్రశ్నించారు. కేసు వివరాలు పరిశీలిస్తే యోగి ప్రభుత్వం బాధితుడికి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని అర్ధమవుతున్నదని ధర్మాసనం పేర్కొంది. తాము ఇచ్చిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని సీజేఐ అన్నారు.