Supreme Court : పంజాబ్లో రైతు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ గత నెల 26 నుంచి నిరాహారదీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ (Jagjit Singh Dallewal) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించకుండా ఇతర రైతు నాయకులు అడ్డుకుంటున్నారు. తమ డిమాండ్ల పరిష్కారంపై హామీ ఇచ్చిన తర్వాతనే దలేవాల్ను ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరిస్తామని పట్టుబడుతున్నారు.
ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో రైతు నేత దలేవాల్ను వెంటనే ఆస్పత్రిలో చేరేందుకు ఒప్పించి, ఆస్పత్రికి తరలించాలని ఈ నెల 20న పంజాబ్ చీఫ్ సెక్రెటరీ, డీజీపీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయడంలో వారు విఫలం కావడంతో వారికి వ్యతిరేకంగా కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది.
దలేవాల్ను ఆస్పత్రికి తరలించకుండా ఇతర రైతు నేతలు అడ్డుకుంటున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు ఆ రైతు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దలేవాల్ క్షేమం కోరేవారు ఆవిధంగా ప్రవర్తించరని వ్యాఖ్యానించింది. రైతు నేతలతో మాట్లాడి దలేవాల్ను వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది.