న్యూఢిల్లీ, మే 29 : జాప్యం వల్ల కక్షిదారులకు పూడ్చలేని నష్టం వాటిలిల్లుతుందని అభిప్రాయపడుతూ తీర్పును రిజర్వ్ చేసిన తేదీ నుంచి మూడు నెలల్లోగా హైకోర్టులు తీర్పులను వెలువరించాలని, ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. హైకోర్టు తీర్పును అప్లోడ్ చేయడంలో జాప్యం జరుగుతున్నదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం పలు మార్గదర్శకాలను జారీచేసింది.
బెయిల్ దరఖాస్తుల్లో ఉత్తర్వులను అదే రోజున వెలువరించాలని, ఒకవేళ రిజర్వ్ చేసిన పక్షంలో మరుసటి రోజున ఉత్తర్వును వెలువరించి అప్లోడ్ చేయాలని హైకోర్టులను ధర్మాసనం ఆదేశించింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వు వెలువడిన వెంటనే ఆ విషయాన్ని జైలు అధికారులకు తెలియజేయాలని, విచారణలో ఉన్న ఖైదీని/దోషిని వీలైనంత త్వరగా అదే రోజు లేదా గరిష్ఠంగా మరుసటి రోజు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తర్వును రిజర్వ్ చేసిన నాలుగు నెలల్లోపల తీర్పును వెలువరించని పక్షంలో మరో ధర్మాసనానికి ఈ కేసును అప్పగించాలని కోరేందుకు కక్షిదారులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.