న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల తొలి దశలో 92 శాతం ఓటింగ్ నమోదవడాన్ని సుప్రీం కోర్ట్ శుక్రవారం ప్రశంసించింది. ‘ఒక భారత పౌరుడిగా ఇంత ఓటింగ్ శాతాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నా. ప్రజలు ప్రజాస్వామ్యంలో తమ శక్తి ఏమిటో తెలుసుకుంటే.. అంటే ఓటుకున్న శక్తిని తెలుసుకొని, చట్టాలను పాటిస్తూ, ప్రజాస్వామ్య విధానాలను, విలువలను గౌరవిస్తూ ఉంటే.. ఇలా 90 శాతం ఓటర్లు ఓటేస్తుంటే.. వాళ్లు హింసాత్మక పనుల్లో పాల్గొనరు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో శక్తి దాగుందని వారికి తెలుసు కాబట్టి’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
అయితే ఇదే సమయంలో జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి బెంగాలీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాజులు యుద్ధాలు చేస్తుంటే.. పేదలు సతమతమై మరణిస్తారు’ అని ఆయన తెలిపారు. ‘సర్’ జాబితాలో ఓట్ల తొలగింపు వివాదంపై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియ వల్ల నష్టపోయిన వ్యక్తులు తమ ఫిర్యాదుల కోసం హైకోర్ట్ లేదా అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించేందుకు స్వేచ్ఛనిస్తూ కోర్ట్ ఉత్తర్వును జారీ చేసింది.