Hathras stampede | హత్రాస్ తొక్కిసలాట ఘటనలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నది. పిటిషన్‌ను విచారణ కోసం సోమవారం లిస్ట్ చేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ నెల 2న హత్రాస్‌లో భోలే బాబా నిర్వహించిన సత్సంగంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఘటనపై నివేదిక తయారు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. న్యాయవాది విశాల్ తివారీ మట్లాడుతూ.. హత్రాస్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు.
జాబితా చేసేందుకు కోర్టు సిద్ధంగా ఉందని.. త్వరలోనే విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. తాము ఓ కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేశామని.. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 121 మంది మృతి చెందారు. ఇందులో మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువ ఉన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ సత్సంగానికి జనం తరలివచ్చారు. వాహనాల సంఖ్య మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడంతో రద్దీని అర్థం చేసుకోవచ్చు. సత్సంగం ముగిసిన తర్వాత భోలే బాబా పాదధూళిని తీసుకునేందుకు జనం ఎగబడిన సమయంలో తొక్కిసలాట చోటు చేసుకున్నది. భద్రత కల్పించడంలో నిర్వాహకులు, పోలీసుల వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు పలువురిని అరెస్టు చేశారు.