Supreme court | ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ ఓ ఎన్జీవో వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పని కోర్టులది కాదని స్పష్టంచేసింది. ఈ పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దంటూ పిటిషన్‌దారును సున్నితంగా మందలించి పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గోవంశ్ సేవా సదన్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అభయ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను మందలించింది. ఈ పని కోర్టులది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా విధించాల్సిన అవసరమున్న ఇటువంటి పిటిషన్లను దాఖలు చేసి విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని మందలించింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేస్తున్నట్లు చెప్పిన ఈ పిటిషన్ ఎవరి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నదనేది స్పష్టం చేయకపోవడం విచారకరమని పేర్కొన్నది.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ కేంద్రాన్ని ఆదేశించాలని గోవంశ్ సేవా సదన్ అనే ఎన్జీఓ ఈ పిటిషన్ వేసింది. ఆవులను సంరక్షించడం చాలా అవసరం అని కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో చెప్పినందున, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి వాటిని ఆదుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్ తీవ్రంగా స్పందిస్తూ.. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని వారించింది. పిటిషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. లేనిపక్షంలో పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని పేర్కొన్నది.