SC Status | న్యూఢిల్లీ, మార్చి 24: ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి దాన్ని చిత్తశుద్ధితో పాటిస్తూ, ఆచరిస్తే ఆ వ్యక్తిని షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) వర్గానికి చెందిన వ్యక్తిగా పరిగణించలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తిని షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ ఇతర మతంలోకి మారినా తక్షణమే షెడ్యూల్డ్ తరగతి హోదాను పూర్తిగా కోల్పోవలసి వస్తుందని కోర్టు తెలిపింది. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఆ ఉత్తర్వు కింద ఉన్న నిషేధం సంపూర్ణమైనదని న్యాయస్థానం పేర్కొన్నది. 1950 నాటి ఉత్తర్వులోని క్లాజ్ 3లో పేర్కొనని ఏ మతంలోకి మారినా పుట్టుకతో సంబంధం లేకుండా తక్షణమే షెడ్యూల్డ్ కుల హోదాను కోల్పోతారని కోర్టు స్పష్టం చేసింది. క్లాజ్ 3 ప్రకారం షెడ్యూల్డ్ కులానికి చెందిన సభ్యునిగా పరిగణించిన ఏ వ్యక్తి అయినా రాజ్యాంగం లేదా పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభకు చెందిన చట్టం కింద ఎలాంటి చట్టబద్ధమైన ప్రయోజనం, రక్షణ, రిజర్వేషన్ లేదా అర్హతను పొందలేరు లేదా వారికి అది వర్తించదు. ఈ నిషేధం సంపూర్ణమైనది. దీనికి ఎలాంటి మినహాయింపు లేదు. ఒక వ్యక్తి ఒకే సమయంలో మరో మత విశ్వాసాన్ని పాటించడం, ఆచరించడం చేయలేరు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్లాజ్ 3లో పేర్కొన్న మతం కాకుండా వేరే మతాన్ని స్వీకరించి షెడ్యూల్డ్ కులంలో సభ్యత్వాన్ని క్లెయిమ్ చేయలేరని కోర్టు తెలిపింది.
క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన కేసులో ఈ తీర్పు వెలువడింది. తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని ఆరోపిస్తూ ఆ వ్యక్తి ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు దాఖలు చేశాడు. తనకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ కల్పించాలని ఆ వ్యక్తి అర్థించగా మతం మారి పాస్టర్‌గా క్రైస్తవ మతాన్ని చురుకుగా ఆచరిస్తున్న కారణంగా ఆ చట్టం చెల్లదని నిందితులు సవాలు చేశారు. 2025 ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెలువరిస్తూ కుల వ్యవస్థ క్రైస్తవ మతానికి విరుద్ధమని, అందువల్ల ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనలను ప్రయోగించడానికి వీల్లేదని ఆదేశించింది. క్రైస్తవ మతంలోకి మారిన ఫిర్యాదుదారుడు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ప్రయోగించి దాఖలు చేసిన ఆరోపణలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిన్ ఎన్ కొట్టివేశారు. దీన్ని సవాలు చేస్తూ పాస్టర్ స్పెషల్ లీవ్ పిటిషన్‌ని దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పును వెలువరించింది.