విజయపుర, సెప్టెంబర్ 17: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మంగళవారం నాటు తుపాకులు, కత్తులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించిన ముగ్గురు ముసుగు దొంగలు బ్యాంకు సిబ్బందిని తాళ్లతో కట్టేసి రూ. 20 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలను దోపిడీ చేసి పరారయ్యారు. విజయపుర జిల్లాలోని చద్చన్ పట్టణంలోని ఎస్బీఐ శాఖలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రూ. కోటికి పైగా నగదు, దాదాపు 20 కిలోల బంగారు అభరణాలతో దొంగలు పారిపోయారని పోలీసుల ఎఫ్ఐఆర్ పేర్కొంది. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. నకిలీ నంబర్ ప్లేటుగల వాహనాన్ని నిందితులు ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని విజయపుర ఎస్పీ లక్ష్మణ్ నింబర్గీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు.