న్యూఢిల్లీ : ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చింది. కరోనా పరిమితుల నేపథ్యంలో ఈ ఏడాది 79,237 మందిని యాత్రకు అనుమతి ఇవ్వగా.. 65 సంవత్సరాలు పైబడిన వారందరికీ అవకాశం లేదని సౌదీ ప్రభుత్వం భారత్కు తెలిపిందని మైనారిటీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ సందర్భంగా మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, హజ్ డ్యూటీకి అధికారులు, సిబ్బంది ఇంటర్వ్యూ పూర్తయ్యిందని తెలిపారు. అయితే, యాత్రకు వచ్చేందరికీ రెండు డోసుల టీకా, ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిందని అధికారులు పేర్కొన్నారు.
కరోనా తర్వాత.. భారతీయ ముస్లింలు హజ్ యాత్ర కోసం సౌది అరేబియాకు వెళ్లడం ఇదే తొలిసారి. భారత్కు 79,237 కోటాను సౌదీ ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వీరిలో 56,601 మంది యాత్రికులు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా.. 22,636 మంది యాత్రికులు హజ్ గ్రూప్ నిర్వాహకుల ద్వారా వెళతారని పేర్కొన్నారు. 2019లో సౌదీ అరేబియా భారతదేశ హజ్ కోటాను 25వేలకు పెంచగా.. ఆ తర్వాత 2లక్షలకు పెంచారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఖ్య తగ్గింది.