న్యూఢిల్లీ, జనవరి 5: ప్రస్తుతం ఈవీఎంలను ఏ విధానంలోనైతే వినియోగిస్తున్నామో అదే విధానంలో లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగిస్తే కచ్చితంగా మళ్లీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు. ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు అనుమానాలను బహిర్గతపర్చారని, అయినా ఎన్నికల కమిషన్ సరిగ్గా స్పందించడం లేదని తెలిపారు. బహుశా ఎన్నికల కమిషన్‌పై ఏదైనా ఒత్తిడి ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఓటు వేసిన తర్వాత వచ్చే వీవీప్యాట్లను లెక్కించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టిసారించాలని కోరారు.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తిరస్కరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు), ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ల పనితీరుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఎన్నికల్లో వీటి పనితీరుపై పూర్తి నమ్మకం ఉందని ప్రకటించింది. వీవీ ప్యాట్లు, ఈవీఎంల పనితీరుపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు కలుసుకోవాలనుకుంటున్నారని, వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ జైరాం రమేశ్ రాసిన లేఖపై ఈసీఐ స్పందించింది.