Karnataka | బెంగళూరు, అక్టోబర్ 15: ఎన్నికల వేళ స్కాంగ్రెస్ అక్రమాల పుట్టలు బద్ధలవుతున్నాయి. ప్రజా మద్దతుతో ఎన్నికల్లో గెలువడం కష్టమని తేలిపోవడంతో డబ్బు బలంతో ఓట్లు దండుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నది. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల నుంచి త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాలకు పెద్ద ఎత్తున డబ్బును తరలిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో ఆ పార్టీ నేతల ఇండ్లల్లో గుట్టలు గుట్టలుగా నగదు పట్టుబడుతుండటమే దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గురువారం కర్ణాటక కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సన్నిహితుడైన ఆ రాష్ట్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అంబికాపతి నివాసంలో రూ.42 కోట్ల అక్రమ సొమ్మును ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని మరువకముందే తాజాగా మరో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కాంతరాజ్కి సన్నిహితుడైన బిల్డర్ సంతోష్ ఇంట్లో రూ.45 కోట్లు లభ్యం కావడం సంచలనంగా మారింది. 3 ట్రంకు పెట్టెలు, 3 బ్యాగులు, 1 సూట్‌కేసులో సర్దిపెట్టిన ఆ డబ్బును అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన డబ్బు గురించి సంతోష్‌ను ఐటీ అధికారులు ప్రశ్నించగా.. అది కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ బెమెల్ కాంతరాజ్ది అని చెప్పడం సంచలనంగా మారింది.
గత 10 రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు పక్కా సమాచారంతో శనివారం బెంగళూరులోని రాజాజీనగర్‌లో ఉన్న కేతమరనహల్లి అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో తనిఖీలు చేపట్టారు. బిల్డర్ సంతోష్ ఆనంద్ నివాసంలో ఉదయం 6 గంటల నుంచి జరిపిన సోదాల్లో రూ.45 కోట్ల మేర నగదు గుర్తించారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత, కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంబికాపతి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలతో కండ్లు బైర్లు కమ్మిన ఐటీ అధికారులు.. మరోసారి దొరికిన భారీ మొత్తం చూసి షాక్‌కు గురయ్యారు. దీంతో మరింత మంది అధికారులను పిలిచారు.
తాజాగా దొరికిన డబ్బు గురించి సంతోష్ ఆనంద్‌ను అధికారులు రోజంతా విచారించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ బెమెల్ కాంతరాజ్ పేరు చెప్పారు. దీంతో అధికారులు ఆ మాజీ ఎమ్మెల్సీ సోదరులను ఫోన్ చేసి ఫ్లాట్‌కు రప్పించారు. దొరికిన సొమ్ము ఎక్కడిదనే దానిపై కూపీ లాగేందుకు వారిని పలు విధాలుగా ప్రశ్నించారు. అయితే వారు ఏం చెప్పారనే దానిపై స్పష్టత లేదు. దాదాపు 18 గంటల పాటు అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో విచారణ జరిపిన దాదాపు 15 మంది ఐటీ అధికారులు.. తర్వాత రికవరీ డబ్బుపై మరింత సమాచారం రాబట్టేందుకు సంతోష్‌కు నోటీసులు ఇచ్చారు. సీజ్ చేసిన డబ్బున్న ట్రంకు పెట్టెలు, బ్యాగులు, సూట్‌కేసును రెండు కార్లలో తరలించారు.
పట్టుబడిన నగదుపై మాజీ ఎమ్మెల్సీ స్పందిస్తూ ఆ డబ్బు తనది కాదని, అసలు సంతోష్ ఎవరో తనకు తెలియదని, ఆయనతో తనకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం. ఐటీ దాడులు గురించి కూడా తనకు తెలియదని, ఈ కేసులో తన పేరు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. ఐటీ దాడుల గురించి తనకు ఎటువంటి నోటీసులు రాలేదన్నారు.
ఐటీ దాడుల్లో పట్టుబడుతున్న సొమ్మంతా పెండింగ్ బిల్లులను మంజూరు చేయించేందుకు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో వసూలు చేసిన అక్రమ సొమ్ముగా తెలుస్తున్నది. గత బీజేపీ హయాంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో పడ్డాయి. వీటిని మంజూరు చేయించేందుకు కొంతమంది కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. వివిధ ప్రాంతాల్లో దాస్తున్న ఈ సొమ్ము ఐటీ అధికారుల దాడుల్లో బయటపడుతున్నట్టు తెలుస్తున్నది. ఆర్టీ నగర్లో సోదాల సందర్భంగా సేకరించిన సమాచారం ఆధారంగా ఐటీ అధికారులు మరికొంత మందిపై దృష్టి పెట్టారు. రెండు ఆపరేషన్లలో మొత్తం రూ.80 కోట్లు గుర్తించినట్టు సమాచారం. మరోవైపు శనివారం ఒక ఆర్కిటెక్ట్, జిమ్ యజమాని ఇండ్లలో జరిపిన సోదాల్లో రూ.8 కోట్లు పట్టుబడిందని ఐటీ అధికారులు తెలిపారు.