లక్నో : యూపీలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు అవసరమైతే సమాజ్వాదీ పార్టీతో (ఎస్పీ) ఆప్ చేతులు కలుపుతుందని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. బీజేపీని గద్దె దించేందుకు ఆప్ సాయం అవసరమైతే ఎస్పీకి తాము వెన్నంటి నిలుస్తామని చెప్పారు. పంజాబ్లో ఆప్ సర్కార్ కొలువుతీరుతుందని, ఉత్తరాఖండ్, గోవాలోనూ సానుకూల ఫలితాలు సాధిస్తామని సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆప్ రాజకీయాలు ప్రజలకు చేరువయ్యాయని చెప్పారు. యూపీలోనూ ఆప్ పట్టు సాధిస్తుందని అన్నారు.
యూపీ కుల రాజకీయాలను అధిగమించి అభివృద్ధిని చూసి ఓటు వేసే చైతన్యం కనబరుస్తుందని పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ఆప్ మ్యానిఫెస్టోను అనుసరిస్తున్నాయని విమర్శించారు. 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సహా ఆప్ హామీలను పలు పార్టీలు కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. యూపీ సీఎం తనను తాను బాబా బుల్డోజర్గా పిలిపించుకుంటున్నారని, ఈ పరిస్ధితిలో యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని సంజయ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా రాజకీయాలతో యూపీకి ఎలాంటి మేలు జరగదని వ్యాఖ్యానించారు.
ఇక మార్చి 7తో ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముగియనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. కాగా, కుల సమీకరణలకు పెట్టింది పేరైన యూపీలో యాదవులు ఇతర ఓబీసీలు, ముస్లిం ఓట్ల మద్దతుతో అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ పావులు కదుపుతుండగా యాదవేతర ఓబీసీలు, బ్రాహ్మణులు ఇతర అగ్రకులాల అండదండలతో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దళితుల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ చెమటోడుస్తోంది.