ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన విపక్ష పార్టీల కూటమి (Opposition Meet) ఇండియా భేటీ శుక్రవారం ముగిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జట్టుగా పనిచేయాలని పలు తీర్మానాలు చేసిన సమావేశం కీలక కమిటీలనూ ఏర్పాటు చేసింది. 12 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని నియమించామని భేటీ అనంతరం శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు.
సమన్వయ కమిటీలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ), టీఆర్ బాలు (డీఎంకే), హేమంత్ సోరెన్ (జేఎంఎం), సంజయ్ రౌత్ (ఎస్ఎస్-యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), లలన్ సింగ్ (జేడీయూ), డీ. రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీపీఎం నుంచి మరో సభ్యుడు ఉంటారని రౌత్ తెలిపారు.
అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులతో కూడిన నాలుగు ప్రధాన కమిటీలను ఈ సమావేశంలో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రచార కమిటీ, సోషల్ మీడియా వర్కింగ్ గ్రూప్ కమిటీ, మీడియా కమిటీ, రీసెర్చి కమిటీలను కూడా నియమించామని తెలిపారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో విపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది.
Read More :